American Currency: పుస్తకాలలో డాలర్ నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్లిన విద్యార్థులు.. తిరిగి రప్పించిన పూణే కస్టమ్స్ అధికారులు

400000 Dollors Between Pages Of 3 Students Books Huge Seizure At Pune Airport
  • రెండు బ్యాగులలో మొత్తం 4 లక్షల డాలర్ నోట్లు
  • ఆఫీసు ఫైల్స్ అంటూ అంటగట్టిన ట్రావెల్ ఏజెంట్
  • దుబాయ్ లోని తమ ఆఫీసులో అందించాలని రిక్వెస్ట్
అమెరికన్ డాలర్ నోట్లను పుస్తకాలలో దాచి తరలిస్తున్న విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 4 లక్షల డాలర్ల విలువైన నోట్లతో దేశం దాటిన వారిని వెనక్కి రప్పించారు. ఆపై వారి నుంచి రూ. 3.5 కోట్ల విలువైన డాలర్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ డాలర్ నోట్లను ట్రావెల్ ఏజెంట్ వారికి ఇచ్చి, దుబాయ్ లోని తమ ఆఫీసులో ఇవ్వాలని కోరిందని బయటపడింది. దీంతో సదరు ట్రావెల్ ఏజెంట్ ను, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారంలో పూణే ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..

మహారాష్ట్రకు చెందిన ముగ్గురు విద్యార్థులు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖుష్బు అగర్వాల్ ను ఆశ్రయించి టికెట్లు బుక్ చేసుకున్నారు. పూణే ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ బయలుదేరారు. చివరి క్షణంలో విమానాశ్రయంకు వచ్చిన ఏజెంట్.. ఆ విద్యార్థులకు రెండు ట్రాలీ బ్యాగులు అందించి వాటిని దుబాయ్ లోని తన ఆఫీసులో అందజేయాలని కోరింది. అందులో అమెరికన్ కరెన్సీ ఉన్న విషయం తెలియక విద్యార్థులు ముగ్గురూ ఆ బ్యాగులను తీసుకుని దుబాయ్ విమానం ఎక్కారు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులకు ఈ హవాలాకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పూణే కస్టమ్స్ అధికారులు దుబాయ్ అధికారులను సంప్రదించారు.

దుబాయ్ లో ల్యాండైన విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ అధికారులు వెనక్కి పంపించారు. పూణే చేరుకున్నాక విద్యార్థుల లగేజీ చెక్ చేయగా.. పుస్తకాల మధ్య దాచిన డాలర్ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 4,00,100 డాలర్ల (మన కరెన్సీలో 3.5 కోట్లు) ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులను విచారించి ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ ను, ఆమెకు డాలర్ నోట్లను సరఫరా చేసిన మహహ్మద్ ఆమిర్ ను అరెస్టు చేశారు. ముంబైలోని ఖష్బూ అగర్వాల్ ఫ్లాట్ లో సోదాలు జరపగా రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ డాలర్ నోట్లను దుబాయ్ చేర్చడానికే ఖుష్బూ అగర్వాల్ సదరు విద్యార్థులను మభ్యపెట్టి ట్రిప్ కు పంపించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
American Currency
Dollors Smugling
Pune Airport
Dubai
Customs

More Telugu News