Jogi Ramesh: జోగి రమేశ్, దేవినేని అవినాశ్ లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

Supreme Court grants bail to Jogi Ramesh and Devineni Avinash
  • చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులపై సుప్రీం విచారణ
  • జోగి రమేశ్, దేవినేని అవినాశ్ లకు ముందస్తు బెయిల్ మంజూరు
  • దేశం దాటి పోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంలపై దాడి కేసులపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్ సహా 20 మంది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీం విచారించింది. వీరందరికీ సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది. 

వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... నిందితులు మూడేళ్లుగా ముందస్తు బెయిల్ కానీ, బెయిల్ కానీ కోరలేదని... ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారని తెలిపారు. ప్రభుత్వం మారడంతో తమ తప్పు బయట పడుతుందనే ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించారని చెప్పారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేయడమే కాక, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాశ్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని చెప్పారు. అవినాశ్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపారు. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్లుగా దర్యాప్తు చేయకుండా తాత్సారం చేశారని... తద్వారా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారని... అయితే, ఇందులో కల్పించుకోవడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని చెప్పింది. నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.


Jogi Ramesh
Devineni Avinash
YSRCP
Supreme Court

More Telugu News