Municipal Tax: ఏపీలో మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్

AP Municipal Special Secretary Suresh Kumar key orders
  • మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్న ముఖ్య కార్యదర్శి
  • ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు తక్కువగా ఉన్నాయని వెల్లడి
  • అత్యధిక పన్ను వసూలు చేసిన కమిషనర్లకు నగదు పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలు
మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పన్నుల వసూలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు తక్కువగా ఉండటంతో పట్టణ స్థానిక సంస్థలకు ఆదాయంలో భారీగా లోటు ఏర్పడిందని గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మార్చి నెలాఖరులోపల 100 శాతం పన్ను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పన్నుల వసూలుకు సంబంధించి పలు సూచనలు చేశారు.

మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి ఖాళీ భూముల యజమానుల వివరాలు సేకరించి బకాయిదారులకు నోటీసులు అందించాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో పెండింగ్ పన్నుల జాబితా ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా డిజిటల్ నోటీసులు పంపించి బకాయిల వివరాలు తెలియజేయాలని, ఆన్లైన్ పేమెంట్ లింక్‌తో పన్నులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 

ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో పన్నుల ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. అత్యధిక పన్ను వసూలు చేసిన మున్సిపల్ కమిషనర్లకు నగదు పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చి గౌరవించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 
Municipal Tax
Andhra Pradesh
Special Secretary Suresh Kumar

More Telugu News