Bulldozer Action: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తి షాపును కూల్చేసిన అధికారులు

Bulldozer Action Against Scrap Shop In Malvan After Anti India Slogans Raised During IND Vs PAK Match
  • మహారాష్ట్రలోని మల్వాన్‌లో ఘటన
  • ఆదివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్
  • మ్యాచ్ చూస్తూ పాక్ అనుకూల నినాదాలు చేసిన ఇద్దరు యువకులు
  • ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • బుల్డోజర్‌తో ఒకరి స్క్రాప్ దుకాణాన్ని కూల్చేసిన అధికారులు
  • ప్రశంసిస్తూ వీడియోను షేర్ చేసిన శివసేన నాయకుడు
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యర్థి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి దుకాణాన్ని మహారాష్ట్ర అధికారులు నిన్న బుల్డోజర్‌తో కూల్చివేశారు. రోహిత్ శర్మ ఔట్ కాగానే అతడు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మల్వాన్ మునిసిపల్ కౌన్సిల్ యంత్రాంగం అతడి స్క్రాప్ దుకాణాన్ని బుల్డోజర్‌తో కూల్చివేసింది. 

పాక్ అనుకూల నినాదాలు చేసిన యువకుడి తుక్కు దుకాణాన్ని బుల్డోజర్లతో అధికారులు కూల్చివేస్తున్న వీడయోను శివసేన నాయకుడు నీలేశ్ రాణే సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు ముస్లిం వలసదారుడి స్క్రాప్ దుకాణాన్ని అధికారులు కూల్చివేశారని ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు. 

‘‘ఇతడిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ బయటి వ్యక్తిని జిల్లా నుంచి తప్పకుండా బహిష్కరించాలి. అయితే, అంతకంటే ముందు సత్వరం అతడి స్క్రాప్ వ్యాపారాన్ని ధ్వంసం చేయాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నందుకు మాల్వన్ మునిసిపల్ కౌన్సిల్ యంత్రాంగానికి, పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ఆయన ఆ పోస్టులో రాశారు.

కాగా, ఇండియా, పాక్ మ్యాచ్ సందర్భంగా సింధుదుర్గ్ జిల్లాలోని మల్వాన్‌లో ఇద్దరు క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. వెంటనే వారిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది. నిందితులపై చర్యలకు డిమాండ్ చేస్తూ నిన్న స్థానికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మునిసిపల్ అధికారులు ఈ చర్య చేపట్టారు.
Bulldozer Action
Anti India Slogans
IND Vs PAK Match
Maharashtra
Malvan

More Telugu News