IITian Baba: పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటియన్ బాబా క్షమాపణలు

IITian Baba trolled for predicting India defeat against Pakistan
  • పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడుతుందని జోస్యం చెప్పిన ‘ఐఐటియన్ బాబా’
  • టీమిండియా గెలుపుతో సోషల్ మీడియాలో ట్రోల్స్
  • క్షమాపణలు చెబుతూ టీమిండియా సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్ చేసిన బాబా
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతుందని జోస్యం చెప్పిన ‘ఐఐటియన్ బాబా’ అభయ్ సింగ్ క్షమాపణలు తెలిపారు. ఏరోస్పేస్ ఇంజినీర్ అయిన అభయ్ సింగ్ ఆ తర్వాత సాధువుగా మారి ‘ఐఐటియన్ బాబా’గా పేరు పొందారు. ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్ అయిన అభయ్ సింగ్ మహాకుంభమేళా సాధువుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

కుంభమేళాలో ఓ పాడ్‌కాస్ట్‌లో బాబా మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ‘ఇస్‌ బార్ ఇండియా నహీ జీతేగా. విరాట్ కోహ్లీ ఔర్ సబ్ కో బోల్ దో కీ జీత్ కే దిఖా దే. మైనే బోలా నహీ జీతేగీ ఇండియా తో నహీ జీతేగీ’ (ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే ) అని చెప్పుకొచ్చారు. అయితే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
   
భారత్ గెలుపుతో ఐఐటియన్ బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆయనను ఒక మోసగాడిగా ముద్రవేసి తమ పాడ్‌కాస్ట్‌లకు ఆయనను ఆహ్వానించడం మానివేయాలని కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిస్తున్నారు. ఇక జోస్యం చెప్పడం మానివేయాలని, కనిపించకుండా వెళ్లిపోవాలని అభయ్ సింగ్‌కు సూచిస్తున్నారు. 

తప్పుడు జోస్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఐఐటియన్ బాబా స్పందించారు. క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను దానికి జోడించారు. ‘‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు. 
IITian Baba
Abhay Singh
Team India
Team Pakistan
Champions Trophy 2025

More Telugu News