India vs pak: ఒక్క మ్యాచ్, ఆరు రికార్డులు.. వివరాలు ఇవిగో!

India vs Pakistan Stats and Records Broken and Created during Champions Trophy 2025
--
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో ఆరు రికార్డులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా కింగ్ కోహ్లీ పేరిటే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు.

ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్ పై 5 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఘనత సాధించిన తొలి ఆటగాడు కోహ్లీయే. ఐసీసీ టోర్నీలలో ఒక దేశంపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, ఆసియా కప్ (వన్డే), ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై సెంచరీ చేసిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

 ఇక వన్డేలలో 14 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడు కూడా కింగ్ కోహ్లీనే.. మొత్తం 287 ఇన్నింగ్స్ లు ఆడి కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ (350 ఇన్నింగ్స్ లు), సంగక్కర (378 ఇన్నింగ్స్ లు) ఉన్నారు.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రెండు క్యాచ్ లు పట్టాడు. దీంతో వన్డేలలో భారత్ తరఫున అత్యధిక క్యాచ్ లు (158) పట్టిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (156) ను కోహ్లీ అధిగమించాడు.

పాక్ పై ఆదివారం చేసిన సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు (27,503) చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కేవలం 20 పరుగులకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే, వన్డేలలో వేగంగా 9 వేల పరుగులు చేసిన ఓపెనర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించడానికి సచిన్ 197 ఇన్నింగ్స్ ఆడగా.. రోహిత్ కేవలం 181 ఇన్నింగ్స్ లలోనే 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
India vs pak
Champions Trophy 2025
records
king kohli
Virat Kohli
Rohit Sharma

More Telugu News