Car Crash: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజం!

Car crash injures 3 of family leads to discovery of 3 bodies at home
  • కోల్‌కతాలోని రూబీ ప్రాంతంలో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు
  • వాహనంలోని ముగ్గురికి గాయాలు
  • అది యాక్సిడెంట్ కాదని, ఆత్మహత్యకు యత్నించారని విచారణలో తేల్చిన పోలీసులు
  • విచారణలో మరో ముగ్గురి ఆత్మహత్య విషయం వెలుగులోకి
  • అందరూ ఒకే కుటుంబానికి చెందినవారే
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను విచారించిన సమయంలో దిగ్భ్రాంతి కలిగే విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని టాంగ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉదయం రూబీ ప్రాంతంలో ఓ మెట్రో పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రణయ్ దే, ఆయన సోదరుడు ప్రసూన్, 16 ఏళ్ల బాలుడు గాయపడ్డారు. 

స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో అది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదని, ఉద్దేశపూర్వకంగానే వారు పిల్లర్‌ను ఢీకొట్టారని తేలింది. ప్రమాదంలో గాయపడిన ప్రణయ్ దే సహా కారులోని మిగతా ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. కారును మెట్రో పిల్లర్‌కు ఢీకొట్టడం ద్వారా ఆత్మహత్యకు యత్నించారు. టాంగ్రాలోని తమ ఇంట్లో ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రణయ్ చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

ఆ వెంటనే పోలీసు బృందం టాంగ్రాలోని వారింటికి చేరుకుని,తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించింది. ఇంటి లోపల ముగ్గురు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయి. వారిలో ఒక బాలిక కూడా ఉంది. భవనం మొదటి అంతస్తులోని వేర్వేరు గదుల్లో వీరి మృతదేహాలను గుర్తించారు. ఇంట్లోని పలు చోట్ల రక్తపు మరకలు ఉన్నాయి. మృతుల్లో ఒకరిని ప్రణయ్ భార్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవి హత్యలా? లేక ఆత్మహత్యలా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.  
Car Crash
Kolkata
Metro Pillar
National News

More Telugu News