ఏపీలో 73 రైల్వే స్టేషన్లకు కొత్త రూపు: అశ్విని వైష్ణవ్
- ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయన్న కేంద్రమంత్రి
- అందుకే బడ్జెట్ లో ఏపీ పేరు ప్రస్తావించలేదని వెల్లడి
- ఏపీలో రైల్వే పనులకు సీఎం చంద్రబాబు విశేష సహకారం అందిస్తున్నారని కితాబు
రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు.
ఇక, ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు.
మున్ముందు ఏపీకి మరిన్ని వందేభారత్ రైళ్లు కేటాయిస్తామని... ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. అన్ని రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఏపీలో అన్ని రైల్వే ట్రాక్ లు సిద్ధం చేస్తున్నామని... కొన్ని మార్గాల్లో గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో రైల్వే పనులు సత్వరమే జరిగేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కొనియాడారు.