పెళ్లి వేదికపై వరుడి డ్యాన్స్.. చిరాకేసి పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి
- ఛోళీ కే పీఛే పాటకు డ్యాన్స్ చేసి పరువు తీశాడని మండిపాటు
- సరదాగా చేశానని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోని వైనం
- తండ్రి నిర్ణయంతో కన్నీళ్లతో వేదిక పైనుంచి దిగిపోయిన వధువు.. ఢిల్లీలో ఘటన
‘ఛీ ఛీ.. ఆ పాటేంటి, నీ డ్యాన్స్ ఏంటి’ అని మండిపడుతూ పెళ్లిని రద్దు చేశాడు. ఇలాంటి పాటకు రోడ్డు మీద తైతక్కలాడే వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయలేనని తేల్చిచెప్పాడు. ఆ తర్వాత ఎవరు ఎంతగా సర్దిచెప్పాలని చూసినా ఆయన వినిపించుకోలేదు. తండ్రి నిర్ణయంతో చేసేదేంలేక వధువు కన్నీళ్లతో వేదిక దిగిపోయింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను షేర్ చేస్తూ.. వధువు తండ్రి చేసింది కరెక్టే, పెళ్లి రద్దు చేయకుంటే రోజూ ఆ డ్యాన్స్ చూడాల్సి వచ్చేదని కొందరు, ఇది అరేంజ్ డ్ మ్యారేజ్ కాదు, ఎలిమినేషన్ రౌండ్ జరుగుతోందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు మాత్రం పెళ్లికొడుకును సమర్థిస్తూ.. ఛోళీకే పీఛే సాంగ్ కు ఉన్న ఊపు అలాంటింది, ఆ పాట ప్లే చేస్తుంటే ఎవరైనా సరే డ్యాన్స్ చేయాల్సిందే. నా పెళ్లిలో ఆ పాట పెడితే నేను కూడా డ్యాన్స్ చేస్తానని కామెంట్ చేశారు.