Wedding: బంధుమిత్రులతో ఊరేగింపుగా గ్రామానికి వచ్చిన వరుడు.. అసలు వధువే లేదని తెలిసి షాక్

Baraat Returns Without Bride As No Wedding Was Planned In Himachal Pradesh
  • హిమాచల్ ప్రదేశ్ లోని గ్రామంలో వింత మోసం
  • ఫొటో చూసి, ఫోన్ లో మాట్లాడి పెళ్లికి ముహూర్తం
  • మేళతాళాలతో గ్రామానికి వచ్చిన పెళ్లి బృందాన్ని చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు
హిమాచల్ ప్రదేశ్ లోని నారీ గ్రామంలో వింత మోసం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం మేళతాళాలతో వచ్చిన పెళ్లి బృందాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అసలు ఆ రోజు ఊళ్లో ఎవరి ఇంట్లోనూ శుభకార్యం జరగడమే లేదని, మరి ఈ పెళ్లి బృందం ఎందుకు వచ్చిందని ఆరా తీశారు. వధువు పేరు, ఫొటో చూసి అసలా అమ్మాయి తమ గ్రామంలోనే లేదని తేల్చిచెప్పడంతో పెళ్లి బృందం నివ్వెరపోయింది.

ఉనా జిల్లాలోని నారీ గ్రామానికి చెందిన ఓ 34 ఏళ్ల యువకుడు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఏదో ఓ కారణంతో సంబంధం కుదరడంలేదు. చివరకు దగ్గరి బంధువు రూ.50 వేలు తీసుకుని ఓ సంబంధం కుదిర్చిపెట్టింది. అమ్మాయి ఫొటో చూసిన యువకుడు మనసుపారేసుకున్నాడు. ఫోన్ లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. యువతి తొందరపెట్టడంతో హడావుడిగా ముహూర్తం నిర్ణయించి పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ముహూర్త సమయానికి బంధుమిత్రులతో కలిసి యువతి స్వస్థలం సింగా గ్రామానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లాడు.

అయితే, ఈ బృందాన్ని చూసి సింగా గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు గ్రామంలో ఎవరింట్లోనూ శుభకార్యం జరగడంలేదని తేల్చిచెప్పారు. దీంతో కంగారుపడ్డ పెళ్లి కొడుకు.. యువతి పేరు చెప్పి ఫొటో చూపించాడు. ఆ ఫొటోలోని అమ్మాయి తమ గ్రామానికి చెందిన యువతి కాదని సింగా సర్పంచ్ చెప్పడంతో పెళ్లి బృందం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు పెళ్లి సంబంధం కుదిర్చిన బంధువును విచారించగా.. పొంతనలేని సమాధానాలు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఈ విషయాన్ని గ్రామ పెద్దల వద్దే తేల్చుకుంటామని పెళ్లి బృందం వాపస్ వెళ్లిపోయింది. ఈ మోసంపై నారీ గ్రామ పెద్దలు చర్చించి పెళ్లి సంబంధం కుదిర్చిన బంధువును బాధ్యురాలిగా తేల్చి, పెళ్లి కోసం చేసిన రూ.5.86 లక్షలు కట్టాలని తీర్పు చెప్పారు.
Wedding
Himachal Pradesh
Barath
NO Bride
Offbeat

More Telugu News