ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టి రైల్వే పట్టాలపై శవమై తేలిన యువకుడు.. అనంతపురంలో విషాదం
- వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ
- తన కొడుకును తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి బెదిరించారన్న తండ్రి
- శనివారం రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదని ఆవేదన
రాత్రి 10:30 ప్రాంతంలో మహేశ్వర్ రెడ్డి నుంచి మెసేజ్ రావడంతో మురళి సోములదొడ్డికి వెళ్లాడు. అయితే, మహేశ్వర్ రెడ్డి అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ రావడంతో మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులకు మురళి ఫోన్ చేసి చెప్పాడు. అందరూ అక్కడికి చేరుకుని వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం సోములదొడ్డి, నాగిరెడ్డి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన మహేశ్వర్ రెడ్డి మృతదేహం కనిపించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే వేధింపులే కారణం.. మృతుడి తండ్రి
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజశేఖర్ రెడ్డి తన కొడుకును వేధించారని, తప్పుడు కేసులతో జైలుకు పంపారని మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్లి రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడమే తమ నేరమని, తమపై కక్ష సాధింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో టీడీపీకి సహకరించామని తమ కుటుంబంపై కోపం పెంచుకున్నారని ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఈ నెల 1న పరిటాల శ్రీరామ్ ను కలిసి ఫేస్ బుక్ లో ఫొటో పెట్టాడని, అది చూసి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తన కొడుకును బెదిరించాడని చెప్పారు.