Crime News: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య

Wife and kills husband with the help of lover in Andhra Pradesh
  • తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని గజసింగరాజపురంలో ఘటన
  • ప్రియుడితో కలిసి భర్త గొంతుకు తాడు బిగించి హత్య
  • మద్యం తాగొచ్చి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం
  • పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం
  • నిందితులు ఇద్దరినీ కటకటాల వెనక్కి పంపిన పోలీసులు
భర్తను అడ్డు తొలగించుకుంటే ఇక తమ వివాహేతర బంధానికి అడ్డం ఉండదని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడిని దారుణంగా హతమార్చింది. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని గజసింగరాజపురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆంటోని (34), సుగంధ్రి (30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుగంధ్రి తన స్వగ్రామమైన నిండ్ర మండలంలోని ఇరుగువాయికి చెందిన అరుళ్‌రాజ్ (35)తో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త పలుమార్లు ఆమెను మందలించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న విషయాన్ని ఆమె ప్రియుడికి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి తమకు అడ్డుగా ఉన్న ఆంటోనిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ సిద్ధం చేశారు.

శుక్రవారం రాత్రి ఇద్దరూ కలిసి ఆంటోని గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత అరుళ్‌రాజ్ వెళ్లిపోగా, సుగంధ్రి ఏమీ ఎరగనట్టు ఇంట్లో నిద్రపోయింది. ఉదయం బయటకు వచ్చి కేకలు వేస్తూ తన భర్త మద్యం తాగొచ్చి రాత్రి చనిపోయాడని ఏడుపు మొదలుపెట్టింది. అనుమానం వచ్చిన బంధువులు నిలదీయడంతో పొంతనలేని సమాధానం ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి ప్రశ్నించడంతో ప్రియుడితో కలిసి భర్తను తానే హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
Crime News
Tirupati
Andhra Pradesh

More Telugu News