Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్‌.. కార‌ణ‌మిదే!

Arrest warrant issued against former Bangladesh captain Shakib Al Hasan
  • ఆదివారం నాడు ష‌కీబ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢాకా కోర్టు 
  • చెక్ బౌన్స్‌ కేసులో అత‌నిపై అరెస్ట్‌ వారెంట్ జారీ
  • షకీబ్‌పై గతేడాది డిసెంబర్‌ 15న చెక్ బౌన్స్‌ కేసు నమోదు
  • ఈ కేసులో డిసెంబర్ 18న ప్రాథమిక విచారణ 
  • జనవరి 19న కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు
  • ష‌కీబ్ స్పందించ‌క‌పోవ‌డంతో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన న్యాయ‌స్థానం
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఢాకా కోర్టు ఆదివారం నాడు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఐఎఫ్‌ఐసీ బ్యాంక్‌కు సంబంధించిన సుమారు 3 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ చెక్ బౌన్స్‌ కేసులో అత‌నిపై అరెస్ట్‌ వారెంట్ జారీ అయింది. ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జియాదుర్ రెహ్మాన్ ఆదివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన‌ట్లు 'క్రిక్‌బజ్' కథనం పేర్కొంది.

2024 ఆగస్టు నుంచి విదేశాల్లో ఉంటున్న షకీబ్‌పై గతేడాది డిసెంబర్‌ 15న చెక్ బౌన్స్‌ కేసు నమోదైంది. డిసెంబర్ 18న ప్రాథమిక విచారణ అనంతరం జనవరి 19న తన ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కానీ, ష‌కీబ్ స్పందించ‌క‌పోవ‌డంతో న్యాయ‌స్థానం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. 

ఈ కేసులో షకీబ్ కంపెనీ అల్ హసన్ ఆగ్రో ఫామ్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ గాజీ షహగిర్ హొస్సేన్, డైరెక్టర్లు ఎమ్దాదుల్ హక్, మలైకర్ బేగం కూడా చిక్కుకున్నారు. ఈ కేసు స్టేట్‌మెంట్ ప్రకారం, షకీబ్ కంపెనీ వివిధ సమయాల్లో ఐఎఫ్‌ఐసీ బ్యాంక్ బనానీ బ్రాంచ్ నుంచి లోన్స్‌ తీసుకుంది. ఈ క్ర‌మంలో లోన్‌లో కొంత భాగాన్ని తిరిగి చెల్లించడానికి షకీబ్ కంపెనీ చెక్కులు ఇచ్చింది. కానీ, వాటి తాలూకు బ్యాంక్ ఖాతాలో స‌రిప‌డ‌ నిధులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. 

మ‌రోవైపు కెరీర్ ప‌రంగాను ష‌కీబ్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అత‌ని బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. బంగ్లాదేశ్ తరపున ఐదు వ‌న్డే ప్రపంచ కప్‌లు, తొమ్మిది టీ20 వ‌ర‌ల్డ్‌ కప్‌లు ఆడిన షకీబ్‌కు గత వారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బంగ్లాదేశ్ ప్ర‌క‌టించిన‌ 15 మంది సభ్యుల జట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఇక హ‌సీనా ప్ర‌భుత్వం కూలిపోయిన త‌ర్వాతి నుంచి అత‌డు విదేశాల్లోనే ఉంటున్నాడు.   
Shakib Al Hasan
Arrest Warrant
Bangladesh
Cricket
Sports News

More Telugu News