Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ గా సితాంశు కోటక్!

Sitanshu Kotak reportedly next batting coach for Team India
  • ఇటీవల టీమిండియాకు వరుస ఓటములు
  • న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్... ఆసీస్ చేతిలోనూ పరాజయం
  • కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళనపై దృష్టిసారించిన బీసీసీఐ
ఇటీవల న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై వైట్ వాష్... ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ ఘోర ఓటమి... ఇదీ టీమిండియా ప్రస్తుత పరిస్థితి. ఈ నేపథ్యంలో, టీమిండియా కోచింగ్ సిబ్బందిలో ప్రక్షాళనపై బీసీసీఐ దృష్టి సారించింది. జట్టు బ్యాటింగ్ కోచ్ ను మార్చాలని బోర్డు నిర్ణయించింది. టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ గా సితాంశు కోటక్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

సితాంశు కోటక్ ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్ గా వ్యహరిస్తున్నాడు. 2023లో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో ఐర్లాండ్ లో టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు కోటక్ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. 

52 ఏళ్ల సితాంశు కోటక్ దేశవాళీ క్రికెట్లో ఘనమైన చరిత్రను కలిగి ఉన్నాడు. కోటక్ గతంలో సౌరాష్ట్ర రంజీ సారథిగా వ్యవహరించాడు. 1992 నుంచి 2013 వరకు దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 130 ఇన్నింగ్స్ లలో 41.76తో 8,061 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 55 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికాక... సితాంశు కోటక్ కోచింగ్  వైపు మళ్లాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ గానూ పనిచేశాడు. గత నాలుగేళ్లగా ఇండియా-ఏ టీమ్ పర్యటనలకు బ్యాటింగ్ కోచ్ గా సేవలందిస్తున్నాడు. 2017 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు. 

ప్రస్తుతం టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ లేడు. గౌతమ్ గంభీర్ చీఫ్ కోచ్ కాగా... మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ర్యాన్ టెన్ డస్కాటే అసిస్టెంట్ కోచ్ గా, టి.దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.

బ్యాటింగ్ కోచ్ రేసులో కేపీ...!

ఇంగ్లండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ (కేపీ) కూడా టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో ఉన్నట్టు సమాచారం. తనకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా రావాలని ఉందని కేపీ ఇటీవలే ప్రకటించాడు. టెస్టు క్రికెట్ లో సైతం దూకుడుగా ఆడతాడని పీటర్సన్ కు పేరుంది. దక్షిణాఫ్రికా జాతీయుడైన కెవిన్ పీటర్సన్ 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేశాడు. సగటు 47.28 కాగా... 23 సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి.
Sitanshu Kotak
Batting Coach
Team India
BCCI

More Telugu News