Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ను కత్తితో పొడిచిన సమయంలో ఇంట్లోనే ఉన్న కరీనా కపూర్

- నిన్న రాత్రి సైఫ్ పై కత్తితో దాడి చేసిన దుండగులు
- వెన్నుపూసలో కత్తి ముక్కను తొలగించిన వైద్యులు
- సైఫ్ చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు చేసిన డాక్టర్లు
- ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
- సైఫ్ శరీరంపై ఆరు కత్తిపోట్లు
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని ఆయన నివాసంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఆయన భార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. దాడి జరిగే సమయంలో అరుపులు విని, అక్కడకు వచ్చిన సైఫ్ కేర్ టేకర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయనపై కూడా దుండగులు దాడి చేశారు.
దాడికి ఒక రోజు ముందే దుండగులు సైఫ్ ఇంట్లోకి చేరుకున్నట్టు సమాచారం. ఒక వ్యక్తి మాత్రమే సైఫ్ పై కత్తితో దాడి చేశారనే వార్తలు ఇప్పటి వరకు వచ్చినప్పటికీ... ఇద్దురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్టు ఇప్పుడు తెలుస్తోంది.
ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు నితిన్ దంగే స్పందిస్తూ... కత్తి పోట్ల వల్ల సైఫ్ వెన్నులో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయిందని తెలిపారు. వెన్నులో ఉన్న కత్తి ముక్కను తొలగించామని వెల్లడించారు. కత్తి పోట్ల కారణంగా గాయపడ్డ సైఫ్ చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించామని తలిపారు. సైఫ్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రిలో సైఫ్ అడ్మిట్ అయ్యారని డాక్టర్ నితిన్ తెలిపారు. థొరాసిక్ స్పైనల్ కార్డ్ లో ఆయనకు కత్తి ముక్క ఇరుక్కుపోయిందని చెప్పారు. థొరాసిక్ స్పైనల్ కార్డ్ మెడ దిగువ ప్రదేశం, పక్కటెముకల దిగువ ప్రదేశం మధ్యలో ఉంటుందని తెలిపారు. కత్తి ముక్కను తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. సైఫ్ ఎడమ చెయ్యి మీద రెండు, మెడ మీద ఒకటి లోతైన కత్తిపోటు గాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు.
సైఫ్ కోలుకుంటున్నారని మరో డాక్టర్ తెలిపారు. ప్రస్తుత పరీక్షల తర్వాత ఆయన 100 శాతం కోలుకుంటారనే అంచనాలు తమకు ఉన్నాయని చెప్పారు. సైఫ్ కు ఆరు కత్తిపోట్లు ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు చికిత్స ప్రారంభంలో తెలిపిన సంగతి తెలిసిందే.