Viral News: గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన ఇద్దరు స్నేహితులు.. ఊహించని విషాదం

Leaving On Burning Stove and two youth died in Noida
  • గది నిండా కార్బన్ మోనాక్సైడ్ నిండి ఊపిరాడక మృతి
  • కొన్ని గంటల వ్యవధిలో నిద్రలోనే మృత్యువాత పడ్డ యువకులు
  • నోయిడాలో వెలుగుచూసిన విషాదకర ఘటన
వారిద్దరూ ‘స్ట్రీట్ ఫుడ్’ విక్రయిస్తూ జీవితాన్ని గడుపుతున్న స్నేహితులు. మరుసటి రోజు నిర్వహించే వ్యాపారం కోసం గ్యాస్ స్టవ్‌పై శనగలు ఉడకబెట్టారు. కానీ, స్టవ్ ఆపకుండానే ఇద్దరూ నిద్రపోయారు. కొన్ని గంటల్లోనే ఇద్దరూ విగతజీవులయ్యారు. ఈ విషాదకర ఘటన నోయిడాలో జరిగింది.

ఉపేంద్ర (22), శివమ్ (23) అనే యువకులు నోయిడాలోని సెక్టార్ 70లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ 'చోలే భతురే', 'కుల్చే' (స్ట్రీట్ ఫుడ్స్) ఫుడ్ స్టాల్‌ను నిర్వహించే వారు. ఎప్పటిలాగానే శుక్రవారం రాత్రి గ్యాస్ స్టవ్‌పై శనగలు ఉడకబెట్టారు. కానీ, స్టవ్ కట్టేయకుండానే నిద్రలోకి జారుకున్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉండడంతో గది మొత్తం వాయువులు వ్యాపించాయి. శనగలతో పాటు ఉడకబెట్టిన పాత్ర కూడా మాడిపోవడంతో హానికర వాయువులు వెలుడ్డాయి. దీంతో, గదిలో కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం పెరిగిపోయి ఆక్సిజన్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో కొన్ని గంటల్లో ఇద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని నోయిడా సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ గుప్తా వెల్లడించారు.

అపాయకరమైన పొగ కారణంగా ఇద్దరికీ ఊపిరాడలేదని రాజీవ్ గుప్తా వివరించారు. గదిలోంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారని, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించిగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని పేర్కొన్నారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించామని పోలీసు అధికారి వివరించారు.

కాగా, కార్బన్ మోనాక్సైడ్ వాసన లేని విష వాయువు. కార్లు లేదా ట్రక్కులు, స్టవ్‌లు, ఓవెన్‌లు, జనరేటర్‌లలో ఇంధనాన్ని మండించినప్పుడు ఈ గ్యాస్ విడుదలవుతుంది. గట్టిగా మూతపెట్టిన లేదా మూసివుంచిన ప్రదేశాలలో కూడా కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Viral News
Noida
Sad News

More Telugu News