Indian Origin: కెన‌డా ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తి నేత‌లు.. ఎవ‌రీ అనితా ఆనంద్, జార్జ్ చాహల్

Anita Anand and George Chahal Indian Origin Contenders Among Frontrunners to Replace Trudeau as Canada PM
  • కెనడా ప్రధాని పదవికి, లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసిన ట్రూడో
  • ఆయ‌న స్థానంలో కొత్త నాయ‌కుడిని ఎన్నుకునే ప‌నిలో లిబ‌ర‌ల్ పార్టీ
  • కొత్త ప్ర‌ధాని రేసులో పలువురు లిబ‌ర‌ల్ పార్టీ నేత‌లు 
  • క్రిస్టియా ఫ్రీలాండ్ తో పాటు అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు
కెన‌డా ప్ర‌ధాన మంత్రి జ‌స్టిన్ ట్రూడో త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 153 మంది లిబరల్ పార్టీ ఎంపీలలో 131 మంది ఆయ‌న దిగిపోవాల‌ని ఓటు వేయ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో అంతర్గత గొడ‌వ‌లు, ప్రజల మద్దతు క్షీణించడంతో జస్టిన్ ట్రూడో సోమవారం కెనడా ప్రధాని పదవికి, లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. దీంతో కెన‌డా త‌దుప‌రి ప్ర‌ధాని ఎవ‌రు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా, ప్ర‌ధాని రేసులో ఇద్ద‌రు భార‌త సంత‌తి నేత‌ల పేర్లూ వినిపిస్తున్నాయి. 

"పార్టీ తన తదుపరి నాయకుడిని ఎన్నుకున్న తర్వాత నేను పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నాను. ఆ ప్రక్రియను ప్రారంభించమని నేను నిన్న రాత్రి లిబరల్ పార్టీ అధ్యక్షుడిని కోరాను" అని ట్రూడో సోమ‌వారం మీడియా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

ఇక జస్టిన్ ట్రూడో రాజీనామాను ఆమోదించడంతో ఆయ‌న స్థానంలో కొత్త నాయ‌కుడిని ఎన్నుకునే ప‌నిలో లిబ‌ర‌ల్ పార్టీ ప‌డింది. ఈ క్ర‌మంలో కొత్త ప్ర‌ధాని రేసులో లిబ‌ర‌ల్ పార్టీ నేత‌లు క్రిస్టియా ఫ్రీలాండ్ తో పాటు భార‌త సంత‌తికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. 

అనితా ఆనంద్.. మాజీ రక్షణ మంత్రి అనితా ఆనంద్, ప్రస్తుతం ట్రూడో క్యాబినెట్‌లో రవాణా, అంతర్గత వాణిజ్య శాఖ‌ మంత్రిగా పనిచేస్తున్నారు. లిబరల్ పార్టీకి నాయకత్వం వహించే ట్రూడో వారసురాలిగా ఆమెను కూడా పరిగణిస్తున్నారు. తమిళనాడు, పంజాబ్‌కు చెందిన భారతీయ వైద్య దంప‌తుల‌కు జన్మించిన ఆనంద్‌కు విస్తృతమైన రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యంగా 2019-21 మ‌ధ్య ప్ర‌జాసేవ‌ల‌ మంత్రిగా కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వైద్య పరికరాలను భద్రపరచడానికి కాంట్రాక్ట్ చర్చలకు ఆమె నేతృత్వం వహించారు.

జార్జ్ చాహల్.. అల్బెర్టా లిబరల్ పార్టీ ఎంపీ జార్జ్ చాహల్. ఆయ‌న ఒక న్యాయవాది. అక్క‌డి సిక్కు కమ్యూనిటీలో బ‌ల‌మైన‌ నాయకుడు. గత వారం తన సహచరులకు ఒక లేఖలో చేసిన అభ్యర్థనకు పలువురు ఎంపీలు ఆయ‌న‌కు మద్దతు ఇచ్చారు. వార్డ్ 5కి కాల్గరీ సిటీ కౌన్సిలర్‌గా పనిచేసిన చాహల్.. ప్రస్తుతం నేచురల్ రీసోర్సెస్, సిక్కు కాకస్‌పై స్టాండింగ్ కమిటీకి ఛైర్మ‌న్‌గా ఉన్నారు. ట్రూడోపై విమర్శలు గుప్పించి, ఆయ‌న ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, చాహల్‌ను లిబ‌ర‌ల్ పార్టీ లెజిస్లేటివ్ కాక‌స్‌ తాత్కాలిక నాయకుడిగా నియమించింది. దాంతో ఆయ‌న పార్టీ నాయ‌కుడిగా గెలిచినా ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టేందుకు అన‌ర్హుడ‌ని  తెలుస్తోంది. కెన‌డా చ‌ట్టాల ప్ర‌కారం తాత్కాలిక నేత‌లు ప్రధాని పదవికి అనర్హుల‌వుతారు. 
Indian Origin
Anita Anand
George Chahal
Canada PM
Justin Trudeau

More Telugu News