Benefit Show: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు

Telangana Cine Exibitors thanked CM Revanth Reddy
  • తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్ రెడ్డి
  • టికెట్ ధరల పెంపును కూడా సమీక్షిస్తామని వెల్లడి
  • సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు
తెలంగాణలో ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ మాట్లాడుతూ... బెనిఫిట్ షోలు వేయడం కరెక్ట్ కాదని అన్నారు. బెనిఫిట్ షోల వల్ల ఎగ్జిబిటర్లకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని చెప్పారు. ఏ సినిమాకైనా నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండాలని స్పష్టం చేశారు. టికెట్ రేట్ల పెంపుతో నిర్మాతలకే తప్ప ఎగ్జిబిటర్లకు లాభం ఉండదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు ఉండదని, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉందని అన్నారు. 

టికెట్ రేట్ల పెంపు వల్ల ఆడియన్స్ ఓటీటీల వైపుకు మళ్లుతున్నారని బుచ్చిబాబు అనే ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. ఇక, బెనిఫిట్ షోలకు హీరోలు రావొద్దని తాము చెప్పం కానీ, హీరోలే ప్లాన్ చేసుకుని రావాలని ఎగ్జిబిటర్లు సూచించారు. సంధ్య థియేటర్ కు టికెట్ కొన్న వారే వస్తే సమస్య ఉండేది కాదని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. 

రేవంత్ నిర్ణయం పట్ల ఏపీ ఎగ్జిబిటర్ల హర్షం

బెనిఫిట్ షోలు ఉండవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ఎగ్జిబిటర్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలనేది సమీక్షిస్తామన్న రేవంత్ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. టికెట్ ధర పెంపు వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని ఏపీ ఎగ్జిబిటర్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 

కీలక సమావేశం చేపట్టిన తెలుగు ఫిలిం ఛాంబర్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో, తెలుగు ఫిలిం ఛాంబర్ నేడు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Benefit Show
Revanth Reddy
Telangan Exibitors
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News