KTR: క్వాష్ పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్న అంశాలు ఇవే!

Points mentioned in KTR petition
  • దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్
  • తాను లాభపడినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదన్న కేటీఆర్
  • ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఆరోపణ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కు సంబంధించి తనపై ఏసీబీ కేసును నమోదు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు. 

ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని... కానీ సదరు ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని కేటీఆర్ పిటిషన్ లో తెలిపారు. 2023 అక్టోబర్ 30న చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు పంపడం ఎఫ్ఈఓ ఉల్లంఘన కాదని తెలిపారు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కు ఇది కొనసాగింపు మాత్రమేనని చెప్పారు. 

అగ్రిమెంట్ ద్వారా తాను వ్యక్తిగతంగా లాభపడినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్ లు ఉంటాయని ఒక మంత్రి బహిరంగంగానే మాట్లాడారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి... ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. 
KTR
BRS
High Court

More Telugu News