తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారు: అసెంబ్లీలో హరీశ్ రావు
- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- కేంద్ర నిధులను ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందన్న హరీశ్
- గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని వ్యాఖ్య
తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారని... ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానమని హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు విడుదల కావడం లేదని చెప్పారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సర్పంచ్ లకు జీతాలు లేవని చెప్పారు. బిల్లులు, జీతాలను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు క్లియర్ అవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.