KTR: ఇది పాలన కాదు పీడన: కేటీఆర్

BRS Working President KTR Criticizes Congress Government
 
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్‌పై మ‌రోసారి ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్‌ది పాలన కాదు పీడన అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. ప్రజల వేదన.. అరణ్య రోదనగా మారిందంటూ ట్వీట్ చేశారు. 

"రైతుల చెరబడితిరి.. పేదల ఇండ్లు కూలగొడ్తిరి. రైతుబంధు ఎత్తేస్తిరి.. రైతుబీమాకు పాతరేస్తిరి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి.. అమ్మవడిని ఆగం చేస్తిరి. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి. ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరి. హామీల అమలు అడిగిన ఆడబిడ్డల ఆశాలను అవమానపరిస్తిరి.

టీఎస్ టీజీగా చేసి.. చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తిరి. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి, ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేస్తిరి. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తిరి.

మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో.. తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటు. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది. కాలంబు రాగానే కాటేసి తీరుతుంది. జై తెలంగాణ" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR
BRS
Telangana

More Telugu News