Lift Crashes: ఆసుపత్రిలో కుప్పకూలిన లిఫ్ట్.. అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి

Lift Crashes In Meerut Hospital Woman Dies Hours After Giving Birth
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
  • సిజేరియన్ ఆపరేషన్ కోసం ఉదయం ఆసుపత్రిలో చేరిన మహిళ
  • బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం జనరల్ వార్డుకు తరలిస్తుండగా ప్రమాదం
  • ఆసుపత్రిపై దాడిచేసి ధ్వంసం చేసిన బాధిత కుటుంబ సభ్యులు
  • ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మహిళను జనరల్ వార్డుకు తరలిస్తుండగా విషాదం జరిగిపోయింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్ కుప్పకూలడంతో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ ఘటన. 30 ఏళ్ల కరిష్మా సిజేరియన్ ఆపరేషన్ కోసం నిన్న ఉదయం కేపిటల్ హాస్పిటల్‌లో చేరింది. అక్కడామె పాపకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం సాయంత్రం ఆమెను స్ట్రెచర్‌పై జనరల్ వార్డుకు తరలిస్తుండగా బెల్ట్ తెగిపోవడంతో లిఫ్ట్ కుప్పకూలింది. 

లోపల చిక్కుకున్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. చివరికి టెక్నీషియన్లు వచ్చి డోర్లు తెరిచి లోపలున్న వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో కరిష్మా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

కరిష్మా మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భావించిన కరిష్మా కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రిపై దాడిచేసి ధ్వంసం చేశారు. వారి ఆగ్రహాన్ని చూసి వైద్యులు, సిబ్బంది పరారయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కరిష్మా జన్మనిచ్చిన చిన్నారిని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు, ఆసుపత్రి మేనేజర్, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని 15 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించాలని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిని అధికారులు సీల్ చేశారు.  
Lift Crashes
Uttar Pradesh
Meerut
Capital Hospital

More Telugu News