Business News: ప్రపంచ బిలియనీర్ల ఉమ్మడి సంపద రెట్టింపు.. ఆసక్తికర రిపోర్ట్ విడుదల

Billionaires combined wealth shoot up 121 percent over the past decade to 14 trillion dollars
  • గత 10 ఏళ్లలో రెండింతలు పెరుగుదల
  • 121 శాతం పెరుగుదలతో 14 ట్రిలియన్ డాలర్లకు చేరిక
  • స్విస్ బ్యాంక్ యూబీఎస్ రిపోర్ట్ వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ఉమ్మడి సంపద గత దశాబ్ద కాలంలో ఊహించని స్థాయిలో పెరిగింది. ఏకంగా 121 శాతం మేర వృద్ధి చెంది 14 ట్రిలియన్ డాలర్లకు చేరిందని స్విట్జర్లాండ్ బ్యాంక్ యూబీఎస్ రిపోర్ట్ వెల్లడించింది. గత 10 ఏళ్ల కాలంలో బిలియనీర్ల సంఖ్య 1,757 నుంచి 2,682కి పెరిగిందని, 2021లో గరిష్ఠ స్థాయిలో 2,686గా ఉందని తెలిపింది. ఈ మేరకు యూబీఎస్ 10వ ఎడిషన్ వార్షిక నివేదికను గురువారం విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల కంటే బిలియనీర్లే ఎక్కువ మొత్తంలో లాభపడ్డారని తెలిపింది. టెక్ రంగానికి చెందిన సంపన్నుల ఖజానా అత్యంత వేగంగా వృద్ధి చెందిందని తెలిపింది.

2015లో బిలియనీర్ల సంపద 6.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఏకంగా 121 శాతం పెరిగి 14.0 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగిందని, ఇదే కాలంలో ప్రపంచ ఈక్విటీలతో కూడిన సూచీ ‘ఎంఎస్‌సీఐ ఏసీ వరల్డ్ ఇండెక్స్’ 73 శాతం మాత్రమే వృద్ధి చెందిందని పేర్కొంది. అత్యధికంగా టెక్ కంపెనీల అధినేతలు, ఆ తర్వాత పారిశ్రామికవేత్తల సంపద అధికంగా పెరిగింది. టెక్ బిలియనీర్ల సంపద 2015లో 788.9 బిలియన్ డాలర్లు ఉండగా 2024 నాటికి ఇది 2.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని, అంటే దాదాపు మూడు రెట్లు వృద్ధి చెందిందని యూబీఎస్ రిపోర్ట్ పేర్కొంది. చైనా బిలియనీర్ల క్షీణత కారణంగా 2020 కారణంగా వృద్ధి మందగించిందని పేర్కొంది. భారతీయ బిలియనీర్ల సంపద 42.1 శాతం పెరిగి 905.6 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇక భారత బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కి పెరిగిందని తెలిపింది.
Business News
Billionaires
Viral News

More Telugu News