బంగాళాఖాతంలో 'ఫెంగల్' తుపాను... కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
- నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- నేడు తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడి
- రేపు కారైక్కాల్-మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం
ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది.
కాగా, తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.