కంగువా సినిమాపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంగువా సినిమాపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు

Jyotika Review On Kanguva Movie
సూర్య కొత్త సినిమా కంగువాపై ఆయన భార్య, నటి జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగువా సినిమా తొలి అరగంట మినహాయిస్తే మిగతా సినిమా అద్భుతమని కొనియాడారు. సూర్య భార్యగా కాకుండా సినిమా లవర్ గా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

సినిమా మొదటి అరగంట కాస్త నిరాశ కలిగించిన మాట వాస్తవమేనని, కానీ  ఆ పార్ట్ ను మాత్రమే ఎత్తి చూపుతూ, సినిమా మొత్తం బాగా లేదని ప్రచారం చేయడం సరికాదని రివ్యూ రైటర్లకు హితవు పలికారు. ఏ సినిమాలో అయినా లోపాలు ఉండడం సహజమేనని, ప్రయోగాత్మకంగా సినిమాలు చేసేటప్పుడు ఇలాంటి సమస్యలు రావడం కొత్తేమీ కాదని జ్యోతిక తెలిపారు. 

వాస్తవానికి కంగువ చిత్రం వెండితెరపై కనుల పండుగ లాంటి చిత్రమని అభివర్ణించారు. ఇలాంటి సినిమాలు తమిళ చిత్ర  పరిశ్రమలో ఎప్పుడూ రాలేదని... కానీ కొందరు మీడియా, ఇంకొందరు ఇతరులు పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలతో కంగువా చిత్రాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతిక ఆరోపించారు. ఎలాంటి తప్పుడు కంటెంట్ లేని కంగువా వంటి చిత్రాలకు ఇలాంటి దారుణమైన రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. 

ఈ చిత్రంలో ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాయి... సెకండాఫ్ లో మహిళల యాక్షన్ ఘట్టాలు, పిల్లవాడిపై ప్రేమను చూపించడం, కంగువాకు జరిగిన ద్రోహం... ఇలాంటి మంచి ఎపిసోడ్లను రివ్యూ రైటర్లు ఎందుకు హైలైట్ చేయరు? అని జ్యోతిక నిలదీశారు. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే ఇలాంటి నెగెటివ్ ప్రచారమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కంగువా ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా ప్రారంభంపై కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ తర్వాత మాత్రం సినిమా అలరించిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నటి జ్యోతిక తమ సినిమాపై అభిప్రాయం వెల్లడించారు.
Advertisement
Jyotika
Suriya
Kanguva
Movie News

More Telugu News