Manipur: మళ్లీ అట్టుడుకుతున్న మణిపూర్‌... సీఎం బీరెన్‌సింగ్‌ నివాసంలోకి నిరసనకారుల చొరబాటు యత్నం

As Manipur Protests Escalate Mob Tries To Storm Chief Minister N Biren Singhs Home
  • సీఎం బీరెన్‌సింగ్ నివాసంపై దాడికి నిరసనకారుల ప్రయత్నం
  • టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టిన భద్రతా బలగాలు
  • ఇటీవల కనిపించకుండా పోయిన ఆరుగురు వ్యక్తులు చనిపోయినట్టు గుర్తించడంతో ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనలు
  • సమగ్ర పరిష్కారాన్ని చూపాలని కోరుతున్న సివిల్ సొసైటీ గ్రూపులు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై సమస్య పరిష్కరించాలని 24 గంటల అల్టిమేటం 
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి అట్టుడుకుతోంది. జిరీబామ్ జిల్లాల్లో భద్రతా బలగాలు, కుకీ తెగకు చెందిన సాయుధ మిలిటెంట్ల మధ్య సోమవారం ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది సాయుధ కుకీలు చనిపోయారు. ఈ హింసాత్మక ఘటన తర్వాత కనిపించకుండా పోయిన ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు ‘బరక్’ అనే నదిలో కనిపించాయి. దీంతో ఒక్కసారిగా నిరసనలు చెలరేగి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

సీఎం నివాసంపై దాడి యత్నం..
సాయుధ మిలిటెంట్ గ్రూపులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సివిల్ సొసైటీ గ్రూపులు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని పరిష్కారాన్ని చూపాలంటూ 24 గంటల అల్టిమేటం విధించాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నివాసంలోకి ఆందోళనకారులు చొరబడేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. మరో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై కూడా నిరసనకారులు దాడి చేశారు. దీంతో మణిపూర్‌లో మళ్లీ అశాంతి నెలకొంది.

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఈ సంక్షోభాన్ని నివారించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మైతేయి తెగ పౌర హక్కుల సంఘం ప్రతినిధి ఖురైజం అథౌబా అన్నారు. మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందే చర్యలు తీసుకోకుంటే నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని సాయుధ సమూహాలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం ‘ఏఎఫ్‌ఎస్‌పీఏ’ని కూడా ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా దళాలకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న ఈ చట్టంపై మణిపూర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఈ చట్టాన్ని సమీక్షించి, ఉపసంహరించుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. కాగా గతేడాది మే నెల నుంచి మణిపూర్‌లోని కుకీ, మైతేయి తెగల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Manipur
N Biren Singh
Kuki
Meitei

More Telugu News