X Corp: ట్రంప్ గెలవడంతో ఎక్స్ కు గుడ్ బై చెబుతున్న లక్షలాదిమంది యూజర్లు

Millions Leave Musks X After Trump Win Shift To Jack Dorseys Bluesky
  • మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘బ్లూస్కై’లో చేరుతున్న వైనం
  • విషపూరితమైన వేదిక అంటూ ‘ఎక్స్’ పై విమర్శలు
  • ట్రంప్ విజయం కోసం ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రచారం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం చాలా వాటిపై పడుతోంది. ట్రంప్ గెలవడం జీర్ణించుకోలేని మహిళలు చాలామంది తమ ప్రియులపైనా, భర్తలపైనా మండిపడుతున్నారట. కొంతమంది అమెరికన్లు దేశం విడిచిపెట్టి వెళుతుండగా.. మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ పైనా ట్రంప్ ఎఫెక్ట్ పడింది.

డొనాల్డ్ ట్రంప్ కు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం, ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ‘ఎక్స్’ లోనూ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండిపడుతున్న యూజర్లు ‘ఎక్స్’ కు గుడ్ బై చెబుతున్నారు. ఇదొక విషపూరితమైన ప్లాట్ ఫాం అంటూ ‘ఎక్స్’ ను వీడుతున్నారు. రోజూ లక్షలాది మంది తమ ఖాతాలను తొలగించుకుంటున్నారని సమాచారం. వీరంతా ‘బ్లూస్కై’ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ దాని పేరును ‘ఎక్స్’ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ పూర్తికాక ముందు ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే వ్యవహరించారు. ట్విట్టర్ ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది. 

అయితే, ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ రంగంలోకి దిగాక చోటు చేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో.... డోర్సే 2021లో ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. 2022లో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’ ని తీర్చిదిద్దారు. డోర్సే ఇటీవలే అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ‘బ్లూస్కై’ కి జే గ్రాబర్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
X Corp
Twitter
Bluesky
Elon Musk
Donald Trump
Jack Dorsey

More Telugu News