Ritesh Deshmukh: సోదరుడి తరఫున కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటుడు రితేశ్ దేశ్‌ముఖ్

Actor Riteish Deshmukh campaigns for brothers in Maharashtra polls
  • లాతూర్ సిటీ, లాతూర్ రూరల్ నుంచి పోటీ చేస్తున్న రితేశ్ సోదరులు
  • తమ మతం ప్రమాదంలో ఉందని కొంతమంది చెబుతున్నారని ఎద్దేవా
  • వారి పార్టీ ప్రమాదంలో ఉందని... కాపాడుకోవడానికే ఇలా మాట్లాడుతున్నారని విమర్శ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు ధీరజ్ దేశ్‌ముఖ్ తరఫున బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారం నిర్వహించారు. ధీరజ్ లాతూర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడే రితేశ్ దేశ్‌ముఖ్. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సోదరులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్ తరఫున ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరు లాతూర్ సిటీ, లాతూర్ రూరల్ నుంచి బరిలోకి దిగారు.

ఈ రోజు ప్రచారంలో పాల్గొన్న రితేశ్ మాట్లాడుతూ... కొంతమంది తమ మతం ప్రమాదంలో పడిందని చెబుతున్నారని, కానీ ప్రమాదంలో పడింది వారి పార్టీయేనని విమర్శించారు. అందుకే దానిని రక్షించమని వారు ప్రజలను కోరుతున్నారని ఎద్దేవా చేశారు. మతం గురించి మాట్లాడితే... మొదట అభివృద్ధి గురించి మాట్లాడమని ప్రజలే సూచించాలన్నారు. మన పని మనం చేసి... ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలన్నారు.

చిత్తశుద్ధితో పని చేయనివారు మాత్రమే మతం గురించి మాట్లాడుతారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన సోదరుడు ధీరజ్ 1.21 లక్షల ఓట్లతో గెలిచారని, ఈసారి మరింత మెజార్టీ ఇవ్వాలని రితేశ్ కోరారు.
Ritesh Deshmukh
Congress
BJP
Maharashtra

More Telugu News