AP Budget: సంక్షేమం.. అభివృద్ధికే ప్రాధాన్యం.. నేడు ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్

Finance Minister Payyavula Keshav To Be Present Budget In Assembly
  • తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి పయ్యావుల
  • ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యం
  • సూపర్ సిక్స్ హామీలు, నీటి పారుదల రంగంపై ప్రత్యేక దృష్టి
  • పోలవరం, రాజధాని పనుల పునఃప్రారంభానికి నిధుల లోటు లేకుండా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటి వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదే పాలన సాగించిన కూటమి ప్రభుత్వం నేడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికశాఖ అధికారులు పీయూష్ కుమార్, జానకి, నివాస్ నుంచి బడ్జెట్ పత్రాలు అందుకున్న మంత్రి వాటికి పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు.  

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా చెమటోడుస్తోంది. ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికమంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు. బడ్జెట్‌పై తీవ్ర కసరత్తు చేసిన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రంగాలకు సమప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలిసింది. అమల్లోకి వచ్చిన సూపర్ సిక్స్ హామీలకు, పెన్షన్లు, దీపం 2.0, అన్న క్యాంటీన్ల పథకాలకు నిధులు కేటాయించినట్టు సమాచారం. అలాగే, నీటిపారుదల, రోడ్ల మరమ్మతులు, నిర్మాణ రంగానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లో పెద్ద పీట వేసినట్టు తెలిసింది. 

అలాగే, పోలవరం, రాజధాని పనుల పునఃప్రారంభానికి నిధుల లేమి లేకుండా బడ్జెట్‌లో ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను అనుసంధానించి బడ్జెట్‌కు రూపకల్పన చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధుల కల్పన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపు, ‘నరేగా’ కింద చేపట్టాల్సిన పనులపై ఆర్థికమంత్రి పయ్యావుల ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం తెచ్చిన వివిధ పాలసీలకు అనుగుణంగా అవసరమైన మేరకు నిధుల సర్దుబాటుపై కసరత్తు చేశారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్య శ్రీ నిధుల చెల్లింపులపైనా మంత్రి ఫోకస్ చేశారు.
AP Budget
AP Assembly Session
Payyavula Keshav

More Telugu News