Water: పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే.. ఇన్ని ప్రయోజనాలా?

If you drink lukewarm water in the morning are there so many benefits
  • జీర్ణ వ్యవస్థ మొదలు చర్మ సౌందర్యం దాకా లాభాలు
  • ఎనిమిది రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయన్న నిపుణులు
  • పరిమితికి మించి వేడి నీటిని తీసుకోవద్దనే సూచనలు
రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. జీర్ణ వ్యవస్థ మొదలుకుని మొత్తంగా శరీర ఆరోగ్యానికి ఇది దోహదపడుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎనిమిది ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

1. జీర్ణ వ్యవస్థ బలోపేతం 
పొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. జీర్ణాశయంలో మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే.. త్వరగా జీర్ణమై కడుపు ఖాళీ అవుతుంది. తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు బాగా అరగడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

2. విష పదార్థాలను తొలగిస్తుంది..
శరీరంలో జీవక్రియల్లో భాగంగా పలు వ్యర్థ, విషపూరిత పదార్థాలు ఉత్పన్నం అవుతాయి. ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా ఆ వ్యర్థ, విషపూరిత పదార్థాలు శరీరం నుంచి మూత్రం, చెమట, ఇతర రూపాల్లో బయటికి వెళ్లిపోతాయి. శరీరం పునరుత్తేజితం అవుతుంది.

3. రక్తం సరఫరా మెరుగవుతుంది..
 వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. వీటితో రక్త నాళాలు వ్యాకోచించి.. శరీర కణాలకు ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ సరఫరా మెరుగవుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

4. నాసికా ద్వారాలు శుభ్రమవుతాయి
గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, శ్వాస ద్వారా వెళ్లే నీటి ఆవిరి కూడా వేడెక్కుతుంది. ఇది శ్వాస వ్యవస్థలో నాళాలను శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో, అలర్జీలతో బాధపడే సమయంలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

5. గొంతులో గరగర, ఇతర ఇబ్బందులు తగ్గుతాయి 
రాత్రి నిద్ర సమయంలో గొంతులో శ్లేష్మం చేరుతుంది. నోటిలోని కొన్ని భాగాలు తడారిపోతాయి. జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడూ ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. అయితే ఉదయమే గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల.. గొంతులో ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది..
ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలో జీవక్రియల (మెటబాలిజం) వేగం పెరుగుతుంది. దీనితో శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చవుతుంది. అదే సమయంలో ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి.

7. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది 
చర్మ ఆరోగ్యం కోసం తగినంత మేర నీళ్లు శరీరానికి అందాల్సిందే. అంతేకాదు.. మన శరీరంలో ఉత్పత్తయ్యే వ్యర్థ, విష పదార్థాలతో చర్మం కళావిహీనం అవుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల ఈ రెండింటికీ పరిష్కారంతోపాటు చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.

8. మానసిక ఒత్తిడి తగ్గి, విశ్రాంతినిస్తుంది..
గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్‌’ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి... మన కేంద్ర నాడీ వ్యవస్థ ప్రశాంతమవుతుంది. మానసిక ఒత్తిడి నియంత్రణలోకి వచ్చి.. విశ్రాంతి అందిన భావన నెలకొంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి  
గోరు వెచ్చని నీటితో లాభాలు ఉన్నాయి కదా అని అజాగ్రత్తగా ఉండవద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పరిమితికి మించి వేడి నీటిని తాగితే.. నోరు, ఆహార నాళం, లోపలి అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వేర్వేరు వ్యక్తుల శరీర తత్వాన్ని బట్టి.. తగిన స్థాయిలో గోరు వెచ్చగా ఉండే నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
Water
health
offbeat
science
Lukewarm
water
health
offbeat
science
Water benefits
Viral News

More Telugu News