Hoax Bomb Threats: బాంబు బెదిరింపులు కూడా కాపీ, పేస్టే.. పోలీసుల కస్టడీలో ఢిల్లీ యువకుడు

Delhi police arrestd 25 year old man for hoax bomb threats to flights
  • నెల రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు
  • టీవీలో బాంబు బెదిరింపు వార్తను కాపీ కొట్టిన ఢిల్లీ నిరుద్యోగి
  • ఢిల్లీ విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
  • అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే బెదిరింపులు
గత నెల రోజులుగా ప్రతి రోజు పదుల సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర ల్యాండింగ్, దారి మళ్లింపు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ బెదిరింపులన్నీ ఉత్తవేనని తేలుతున్నా.. బెదిరింపు వచ్చిన ప్రతిసారీ విమానాన్ని తనిఖీ చేయడం తప్పనిసరి కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

తాజాగా పలు విమానాలకు బాంబు బెదిరింపులకు పాల్పడిన ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన 25 ఏళ్ల నిరుద్యోగి శుభమ్ ఉపాధ్యాయను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇలాంటి కారణంతోనే గత వారం 17 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అక్టోబర్ 14 నుంచి 275 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 

బాంబు బెదిరింపు ఎందుకు?
తాజా కేసులో నిందితుడు 12వ తరగతి వరకు చదువుకున్నాడు. విమానాలకు బాంబు బెదిరింపులకు సంబంధించిన వార్తలను టీవీలో చూసిన నిందితుడు తాను కూడా అలానే చేయాలనుకున్నాడు. వెంటనే ఢిల్లీ విమానాలను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే అతడు అలా చేశాడని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిప్యూటీ కమిషనర్ ఉషా రంగ్‌నాని తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.  

నిందితుడి పోస్టు చేసిన సోషల్ మీడియా ఖాతాను ట్రేస్ చేసిన పోలీసులు నిన్న ఉదయం శుభమ్ ఉపాధ్యాయ్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై ‘సస్పెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్ట్స్ అగైనిస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (ఎస్‌యూఏ-ఎస్‌సీఏ) చట్టంతోపాటు బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇలా బాంబు బెదిరింపులకు పాల్పడే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హెచ్చరించారు.
Hoax Bomb Threats
Aeroplanes
Delhi
IGI Airport

More Telugu News