Vangalapudi Anitha: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం... హోంమంత్రి అనిత ఏమ‌న్నారంటే..!

Home Minister Vangalapudi Anitha Says Focused On Women Security In Andhra Pradesh
  • ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారం
  • ఈ ఘటన చాలా బాధాకరమన్న‌ హోంమంత్రి 
  • ఈ కేసులో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని వెల్ల‌డి
  • నేరాలు చేసినవాళ్లు తప్పించుకోకుండా చర్యలు ఉంటాయ‌ని వ్యాఖ్య‌
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని తెలిపారు. 

ఇక పట్టుబడ్డ‌ నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా, మ‌రో నిందితుడిపై 32 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసును స్పెషల్‌ కోర్టుకు అప్పగిస్తామన్న మంత్రి... నిందితులకు సాధ్య‌మైనంత‌ త్వరగా శిక్షపడేలా చేస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. 

రాష్ట్ర‌వ్యాప్తంగా ఎవ‌రు నేరాల‌కు పాల్ప‌డినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరాలు చేసినవాళ్లు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలు తగ్గిండచడమే తమ ప్రాధాన్యమని అన్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల వ‌ద్ద ప‌టిష్ట‌మైన‌ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

అలాగే, అన్ని ప్రార్థనాలయాల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఎట్టిప‌రిస్థితుల్లో రాజీప‌డ‌ద‌ని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ఏ చిన్న ఘటన జరిగినా సరే సీఎం స్వయంగా ఆరా తీస్తున్నారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

కాగా, మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సోమవారం డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని ఆదేశించారు. ఆ దిశగా, హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు కచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సూచించారు.
Vangalapudi Anitha
Andhra Pradesh
Women Security

More Telugu News