Salman Khan: భారీ భద్రత నడుమ బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చిన సల్మాన్ ఖాన్

 Salman Khan visits Baba Siddique residence in Mumbai
  • ముంబయిలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య
  • మిత్రుడి మరణంతో విషాదంలో సల్మాన్ ఖాన్
  • బిగ్ బాస్ షూటింగ్ ఆపేసుకుని హుటాహుటీన ఆసుపత్రికి వెళ్లిన సల్మాన్
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ముంబయిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. దుండగుల కాల్పుల్లో సిద్దిఖీ మృతి చెందారు. కాగా, బాబా సిద్ధిఖీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. తన మిత్రుడు హత్యకు గురికావడం పట్ల సల్మాన్ ఖాన్ విషాదంలో మునిగిపోయారు. 

సల్మాన్ ఖాన్ ఈ సాయంత్రం భారీ భద్రత నడుమ బాంద్రాలోని బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చారు. సిద్ధిఖీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిద్ధిఖీ నివాసానికి వచ్చిన సందర్భంగా సల్మాన్ ముఖంలో తీవ్ర విచారం కనిపించింది. 

సల్మాన్ ఖాన్ ను చాలాకాలంగా  టార్గెట్ చేస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా సిద్ధిఖీని హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. నిన్న బాబా సిద్ధిఖీ హత్య గురించి తెలియగానే, బిగ్ బాస్-18 చిత్రీకరణను మధ్యలోనే వదిలేసిన సల్మాన్ ఖాన్ హుటాహుటీన ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే సిద్ధిఖీ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కాగా, బాబా సిద్ధిఖీ గతంలో ముంబయిలోని బాంద్రా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సల్మాన్ ఖాన్ కూడా బాంద్రా ఏరియాలోనే నివసిస్తున్నారు. 

బాబా సిద్ధిఖీకి సినీ రంగంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన తరచుగా పార్టీలు ఇస్తుంటారు. ఈ పార్టీలకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎక్కువగా హాజరవుతుంటారు. 

ఓ వివాదం కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్... 2013లో సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుని తమ మధ్య విభేదాలకు స్వస్తి పలికారు. ఇప్పుడు బాబా సిద్ధిఖీ మృతితో బాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు సిద్ధిఖీ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
Salman Khan
Baba Siddique
Murder
Mumbai
Bollywood

More Telugu News