AP News: ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం... చంద్రబాబు వార్నింగ్

fake news on social media about free sand
  • ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం
  • ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం 
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్
  • అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు 
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్‌లైన్ ద్వారా లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు మాత్రం చెల్లించి ఇసుక పొందే అవకాశం కల్పించారు. 

అయితే ఉచిత ఇసుకపై సోషల్ మీడియా వేదిక ద్వారా అసత్య ప్రచారం జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బ్రేక్ వేయాలని మీనాను ఆదేశించారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఉచిత ఇసుకపై ప్రజల్లో అపోహలు కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ఈ తరహా పనులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న శాండ్ పాలసీపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికితీసి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
AP News
Free Sand Policy
Chandrababu
Social Media

More Telugu News