kinjarapu rammohan naidu: వంశధార రెండో దశ పూర్తి చేస్తాం .. కేంద్ర, రాష్ట్ర మంత్రుల హామీ

we will complete the second phase of vamsadhara kinjarapu rammohan naidu
  • వంశధార ఎడమ కాలువ ఆధునికీకరిస్తామని చెప్పిన రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
  • వంశధార కార్యాలయంలో సిఆర్ఎం పట్నాయక్, మోక్షగుండం విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు
  • నేరడి బ్యారేజ్‌కి సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తామని వెల్లడి
శ్రీకాకుళం జిల్లా జీవనాడి వంశధార ప్రాజెక్టు రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని, అలాగే ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను ఆధునికీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వంశధార కార్యాలయ ఆవరణలో వంశధార ప్రాజెక్టు రూపశిల్పి దివంగత సిఆర్ఎం పట్నాయక్, అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలను వారు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ త్వరలోనే నాగావళి వంశధార నదుల అనుసంధానాన్ని కూడా పూర్తి చేస్తామని, తాను పార్లమెంటు సభ్యుడుగా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించానని, వీటిని పూర్తిచేసే బాధ్యత తనపై ఉందని అన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ నిధులైనా, కేంద్రం నిధులైనా తీసుకొని వస్తామని తెలిపారు. 
 
నేరడి బ్యారేజ్‌కి సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఒడిశా ముఖ్యమంత్రిని కలిసేలా ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేకుండా నేరడి బ్యారేజ్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మన జిల్లాలో బ్రహ్మాండమైన నాగావళి, వంశధార లాంటి జీవ నదులు ఉన్నాయని, అయినప్పటికీ మనం ఇంకా వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నీటిపారుదల వల్లనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని, పట్నాయక్ లేకపోతే వంశధార ప్రాజెక్టు లేదన్నారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజు నాడే ఇద్దరు గొప్ప వ్యక్తుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం మర్చిపోలేని విషయం అన్నారు. ఒడిశాతో ఉన్న అభ్యంతరాలను తొలగించి త్వరలోనే నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని మొదలు పెడతామని, జిల్లాను అపర అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, నార్త్ కోస్ట్ సీఈ సుగుణాకర రావు, వంశధార ఎస్ఈ రాంబాబు, ఏపీటిపిసి చైర్మన్ వజ్జ బాబురావు, డిసిసిబి మాజీ చైర్మన్ డోల జగన్, ఒడిస్సా విశ్రాంత చీఫ్ ఇంజనీర్ సి వి ప్రసాద్, సిఆర్ఎం పట్నాయక్ కుమారుడు సి ఈశ్వర్ మోహన్, అల్లుడు కల్నల్ పివి రమణారావు తదితరులు పాల్గొన్నారు.
kinjarapu rammohan naidu
vamsadhara
Kinjarapu Acchamnaidu
Telugudesam
Andhra Pradesh

More Telugu News