Agra: టూరిస్టు మాదిరిగా అర్ధరాత్రి ఆటో ఎక్కిన లేడీ పోలీసు ఆఫీసర్.. ఆ తర్వాత జరిగిందిదే

a senior woman cop in Agra traveled alone in an auto late at night to check women safety
సివిల్ డ్రెస్‌ ధరించి.. టూరిస్టు మాదిరిగా ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి అర్ధరాత్రి ఓ ఆటో ఎక్కారు. అంతేకాదు ఒక రైల్వే స్టేషన్‌ వెలుపల నిలబడి భయమేస్తోందంటూ పోలీసులకు ఫోన్ చేశారు. ఆగ్రా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీసు(ఏసీపీ) సుకన్య శర్మ నిర్వహించిన ఈ ఉమెన్ సేఫ్టీ టెస్టుల్లో అటు ఆటో డ్రైవర్.. ఇటు పోలీసు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సిబ్బంది పాసయ్యారు. నగరంలో మహిళల భద్రతను పరిశీలించేందుకు శనివారం అర్ధరాత్రి ఆమె ఆటోలో ఒంటరిగా ప్రయాణించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నంబర్‌ 112 పనితీరును ఆమె స్వయంగా తెలుసుకున్నారు.

పర్యాటకురాలి మాదిరిగా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ బయట నిలబడ్డారు. అంతా నిర్మానుష్యంగా ఉంది, భయమేస్తోంది.. సాయం కావాలంటూ పోలీసులకు కాల్ చేశారు. స్పందించిన హెల్ప్‌లైన్ ఆపరేటర్ ఆమెను సురక్షిత ప్రదేశంలో నిలబడమని సూచించారు. ఆమెకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వెంటనే పెట్రోలింగ్ టీమ్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. తీసుకెళ్లేందుకు వస్తున్నామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో అధికారి సుకన్య శర్మ వెంటనే అసలు విషయాన్ని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌ పరిశీలిస్తున్నానని, పరీక్షలో మీరు పాసయ్యారని వారికి చెప్పారు.

ఆ తర్వాత అధికారి సుకన్య శర్మ ఒక ఆటో ఎక్కారు. డ్రాప్ లొకేషన్ చెప్పి ఛార్జీ ఎంతో చెప్పిన తర్వాత ఆమె ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ వద్ద కూడా టూరిస్ట్ మాదిరిగానే వ్యవహరించారు. తన గుర్తింపును చెప్పకుండానే నగరంలో మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై డ్రైవర్‌తో మాట్లాడారు. పోలీసులు తనను వేరిఫై చేశారని, త్వరలోనే డ్రైవర్ యూనిఫాం ధరించి ఆటో నడుపుతానని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత అతడు సురక్షితంగా అధికారి సుకన్య శర్మ దిగాల్సిన చోట దింపాడు. అర్ధరాత్రి సమయంలో మహిళల భద్రతను తనిఖీ చేసిన ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Agra
Uttar Pradesh
Viral News

More Telugu News