చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన కంటైనర్ లారీ
- ఇద్దరి దుర్మరణం.. మరో 11 మందికి గాయాలు
- మృతులు ఇద్దరూ ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వారే
- బస్సు ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్
బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద ఫెయిలైంది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా పార్క్ చేసి మరమ్మతు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. బస్సులో ప్రయాణికులు కొంతమంది నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కంటైనర్ లారీ వేగంగా దూసుకువచ్చి బస్సును ఢీ కొట్టింది.
ప్రమాద తీవ్రతకు బస్సు వెనకభాగం తీవ్రంగా దెబ్బతింది. లోపల సీట్లలో పడుకున్న ప్రయాణికులలో ఇద్దరు యువకులు చనిపోయారు. వారిద్దరూ ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సతీశ్ కుమార్, తేజగా పోలీసులు గుర్తించారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.