Israel: లెబ‌నాన్‌లో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు... 182 మంది మృతి

Israel airstrikes against hundreds of Hezbollah targets on Monday
  • హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు
  • 727 మందికి గాయాలు
  • మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్టు చెబుతున్న లెబనాన్న ప్రభుత్వం
లెబనాన్ అతివాద సంస్థ హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇటీవలే పేజర్స్, వాకీ టాకీలను పేల్చివేసిన ఇజ్రాయెల్... తాజాగా భీకర వైమానిక దాడులు నిర్వహించింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడుల్లో కనీసం 182 మంది మరణించారని, 727 గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని, అయితే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

‘‘ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి లెబనాన్ దక్షిణ పట్టణాలు, గ్రామాలపై శత్రు దాడులు జరిగాయి. 182 మంది మరణించారు. 727 మంది గాయపడ్డారు. మరణించినవారిలో పిల్లలు, మహిళలు, వైద్య సహాయ సిబ్బంది ఉన్నారు’’ అని పేర్కొంది.

కాగా లెబనాన్‌లో దాడులపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ స్పందించారు. ‘‘లెబనాన్‌లో మా దాడులను తీవ్రతరం చేస్తున్నాం. మా దేశ ఉత్తర భూభాగంలోని ప్రజలు వారి ఇళ్లలో ప్రశాంతంగా నివసించాలనే మా లక్ష్యం నెరవేరే వరకు మా చర్యలు కొనసాగుతాయి’’ అని స్పష్టం చేశారు. 

లెబనాన్‌లో వైమానిక దాడుల అనంతరం సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్‌లో దక్షిణం, తూర్పు బెకా లోయతో పాటు సిరియాకు సమీపంలో ఉండే ఉత్తర ప్రాంతంలో కూడా దాడులు చేశామని పేర్కొన్నారు.

కాగా, గతేడాది ఇజ్రాయె‌ల్‌లో నరమేధం సృష్టించిన హమాస్‌కు హిజ్బుల్లా మద్దతిస్తోంది. పలుమార్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి రాకెట్‌లను ప్రయోగించింది. అందుకే హిజ్జుల్లా స్థావరాలను దెబ్బతీయడంపై ఇజ్రాయెల్ దృష్టిసారించింది.
Israel
Lebanon
Hezbollah
Hamas

More Telugu News