Nara Lokesh: అందుకే కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

AP Minister Nara Lokesh attends CII Conference in Vijayawada
  • విజయవాడలో సీఐఐ సదస్సు
  • హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • గత ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యలు
పెట్టుబడుదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడలోని తాజ్ వివాంత హోటల్ లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారో ఈ సదస్సులో చర్చించడం జరిగిందని వెల్లడించారు. ఇందుకోసం కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

పెట్టుబడుదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ప్రభుత్వంతోనే చర్చించవచ్చని అన్నారు.. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుపై వారం రోజుల్లో జీవో ఇస్తామని తెలిపారు. ప్రభుత్వాలు మారవచ్చుకానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలని, ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలను వేరే ప్రభుత్వం మార్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.

ఇక, రాష్ట్రాభివృద్ధిలో సీఐఐ కీలకపాత్ర పోషించాలని ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కోరారు. విశాఖను ఐటీ హబ్ గా రూపొందించడంతో పాటు డేటా సెంటర్, ఏఐ యూనివర్సిటీని నెలకొల్పుతామన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. 

నూతన ఆలోచనలతో ముందుకు వెళుతున్నామని, ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండా అని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల విస్తృత అవకాశాలను భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులకు వివరించామని తెలిపారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామన్నారు. 
 
గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారికి రావాల్సిన రాయితీలు, వారితో పెట్టుబడులు పెట్టించేందుకు ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చామని తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు ఉండేదని, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండేదని వెల్లడించారు.

గత ప్రభుత్వం ఈడీబీని మూసేసింది. మూసేసిన ఈడీబీని పునరుద్ధరించాం. ఈడీబీలో పనిచేసినవారందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వారందరూ ఈడీబీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ను కూడా ఈడీబీ సీఈవోగా నియమించడం జరిగిందని పేర్కొన్నారు.
Nara Lokesh
CII
Vijayawada
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News