Indian Official: వాషింగ్టన్‌లో భారతీయ అధికారి అనుమానాస్ప‌ద మృతి!

Indian Official Found Dead Under Mysterious Circumstances In Washington
  • వాషింగ్టన్‌లోని భార‌త‌ రాయ‌బార కార్యాల‌యం ప్రాంగణంలో ఘ‌ట‌న‌
  • దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు 
  • కుటుంబ గోప్యత కార‌ణంగా మృతుడి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌ని ఎంబ‌సీ
భారత ఎంబ‌సీ అధికారి ఒక‌రు బుధవారం వాషింగ్టన్‌లోని రాయ‌బార కార్యాల‌యం ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్ల‌డించింది. 

భార‌త రాయ‌బార కార్యాల‌యం శుక్రవారం అధికారిక ప్రకటనలో అధికారి మరణాన్ని ధ్రువీకరించింది. కానీ, ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎంబ‌సీ వెల్ల‌డించ‌లేదు.

"ప్రగాఢమైన విచారంతో 18 సెప్టెంబర్ 2024 సాయంత్రం భారత రాయబార కార్యాలయ సభ్యుడు మరణించారని ధ్రువీకరిస్తున్నాం. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి త‌ర‌లించ‌డానికి అన్ని సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపింది.

"కుటుంబ గోప్యత కోసం చ‌నిపోయిన అధికారి వివరాలను వెల్ల‌డించ‌డం లేదు. ఈ దుఃఖ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు మృతుడి కుటుంబంతోనే ఉంటాయి. మా బాధ‌ను అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నాం. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అని రాయ‌బార కార్యాల‌యం పేర్కొంది.
Indian Official
Washington
Mysterious Circumstances

More Telugu News