Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. ఫిలిం ఛాంబర్ రియక్షన్ ఇదే!

Film Chamber reaction to Poonam Kaur comments on Trivikram Srinivas
  • త్రివిక్రమ్ పై తన ఫిర్యాదును సినీ పెద్దలు పట్టించుకోలేదన్న పూనమ్
  • ఇప్పటికైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్య
  • ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలని సూచించిన తమ్మారెడ్డి
టాలీవుడ్ లో గురూజీగా పేరొందిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, సినీ నటి పూనమ్ కౌర్ కు మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజాగా త్రివిక్రమ్ ను ఆమె మరోసారి టార్గెట్ చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి ఆమె సంచలన ట్వీట్ చేశారు. 

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ... ఆయనపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గతంలో ఫిర్యాదు చేశానని... అయితే, సినీ పెద్దలు తన ఫిర్యాదులు పట్టించుకోలేదని విమర్శించింది. తనను రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పింది. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్యానించింది.

పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై 'మా' ఇంకా స్పందించకపోయినా... ఫిలిం ఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో? ఎందుకు ఫిర్యాదు చేసిందో? ఫిలిం ఛాంబర్ కు తెలియదని అన్నారు. ఫిర్యాదు లేకుండా తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. 

తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే... ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు ఇవ్వాలని తమ్మారెడ్డి సూచించారు. పూనమ్ ఫిర్యాదును 'మా' తమకు ఫార్వర్డ్ చేసినా... తాము ఆ అంశంపై విచారిస్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో ఓ బాక్స్ ఉంటుందని... ఆ డబ్బాలో ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. లేదా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. మరోవైపు పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేశారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
Poonam Kaur
Trivikram Srinivas
Film Chamber
Tollywood

More Telugu News