Revanth Reddy: మా డిమాండ్ నెరవేర్చితే మోదీ ఎంచుకున్న లక్ష్యానికి సహకరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy says will support PM Modi 5 trillion dollars target
  • కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని డిమాండ్
  • అప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న మోదీ లక్ష్యానికి సహకరిస్తామన్న సీఎం
  • తెలంగాణకు భారీ రుణభారం సవాల్‌గా మారిందన్న రేవంత్ రెడ్డి
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ డిమాండ్‌ను నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఎంచుకున్న లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. భారీ రుణ భారం రాష్ట్రానికి సవాల్‌గా మారిందని వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు కూడా ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మౌలికవసతుల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని, వడ్డీని చెల్లించడానికి వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపుతుందని వాపోయారు. అందుకే రుణాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర సహకారం అవసరమన్నారు.

రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ది ఫ్యూచర్‌ స్టేట్‌గా పిలుస్తున్నామని తెలిపారు. దేశంలోనే వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని అన్ని రాష్ట్రాల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తెలంగాణ వంతు బాధ్యతను నెరవేరుస్తామన్నారు.
Revanth Reddy
Congress
Narendra Modi
Telangana
BJP

More Telugu News