Crime News: హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థిని హోటల్ రూములో నిర్బంధించి 20 రోజులుగా అఘాయిత్యం

Girl Locked In Hyderabad Hotel by Instagram Friend
  • భైంసా అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు
  • హైదరాబాద్ రప్పించి నారాయణగూడలోని ఓ హోటల్‌లో నిర్బందం
  • వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేయడంతో రక్షించిన షీ టీమ్స్
  • మరో ఘటనలో సహచర విద్యార్థుల నుంచి విద్యార్థినికి లైంగిక వేధింపులు
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు. అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కంగారుపడిన వారు వెంటనే హైదరాబాద్ చేరుకుని షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. బాధితురాలు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నారాయణగూడలోని ఓ హోటల్‌లో బాధిత విద్యార్థిని ఉన్నట్టు గుర్తించి రక్షించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మరో ఘటనలో క్లాస్‌మేట్స్ వేధింపులు
హైదరాబాద్‌లోనే జరిగిన మరో ఘటనలో కలినరీ అకాడమీలో చదువుతున్న విద్యార్థిని ఆమె సహచర విద్యార్థులే లైంగికంగా వేధించసాగారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందుకున్న షీ టీమ్స్ రంగంలోకి దిగి ఆమెను రక్షించాయి. కొందరు యువకులు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Hyderabad
Bhainsa
Student
Narayanaguda

More Telugu News