Japan: జపాన్ లో బియ్యం కొరత.. సూపర్ మార్కెట్లలో నో స్టాక్ బోర్డులు

No rice in Japans supermarkets What led to the unprecedented shortage
  • భారీ భూకంపం హెచ్చరికల నేపథ్యంలో ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్న జనం
  • ఈసారి నీటి కొరత కారణంగా తగ్గిన వరి ఉత్పత్తి
  • సెప్టెంబర్ నెలాఖరుకు పంట చేతికి వస్తుందని మంత్రి వివరణ 
ఓవైపు భారీ భూకంప హెచ్చరిక.. మరోవైపు విరుచుకుపడుతున్న తుపాన్లతో జపాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జపాన్ లో బియ్యానికి కొరత ఏర్పడింది. ఏ సూపర్ మార్కెట్లో చూసినా నో స్టాక్ బోర్డ్ లే దర్శనమిస్తున్నాయి. రోజువారీగా తెప్పించిన బియ్యం స్టాక్ మధ్యాహ్నానికే ఖాళీ అవుతోంది. మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడిందనే వార్తలతో జపాన్ వాసులు ఆందోళనలతో సూపర్ మార్కెట్లకు పోటెత్తుతున్నారు. బియ్యం కోసం క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సూపర్ మార్కెట్లు, షాపుల యజమానులు బియ్యం కొనుగోలుపై రేషన్ విధించారు. ఒక కుటుంబానికి రోజుకు ఒక రైస్ బ్యాగ్ మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకున్నారు.

ఎందుకీ పరిస్థితి..?
ఈ ఏడాది జపాన్ లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సరిపడా నీరు లేక వరి సాగు తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో సహజంగానే బియ్యం కొరత ఏర్పడింది. దీనికి తోడు ఇటీవలి వరుస భూకంపాల నేపథ్యంలో భారీ భూకంపం రానుందని సైంటిస్టులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. మరోవైపు తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. వీటన్నింటి ఫలితంగా నిత్యావసర వస్తువులకు డిమాండ్ ఏర్పడింది. బియ్యం సహా ఇతరత్రా రోజువారీ అవసరాల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు. ప్రజల ముందుజాగ్రత్త చర్యల కారణంగా మార్కెట్లో బియ్యానికి కొరత మరింత పెరిగింది.

ప్రభుత్వం ఏమంటోంది..?
మార్కెట్లో బియ్యం కొరత తాత్కాలికమేనని జపాన్ వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించింది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని, అలా చేయొద్దని విజ్ఞప్తి చేసింది. వరి సాగు విస్తీర్ణం గతంలో కంటే పెరిగిందని, వచ్చే నెలాఖరు నాటికి మార్కెట్లోకి పంట కోతకు వస్తుందని పేర్కొంది. కొత్త బియ్యం అందుబాటులోకి వస్తే బియ్యం కొరత తీరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు.
Japan
Rice Shortage
MegaEarthQuake
Super Markets

More Telugu News