Woman Doctor: ముంబై ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి

Woman Doctor Assaulted By Drunk Patient His Relatives At Mumbai Hospital
  • ముఖంపై గాయాలతో మద్యం మత్తులో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి
  • చికిత్స చేస్తున్న వైద్యురాలిపై తిట్ల దండకం
  • ఆదివారం తెల్లవారుజామున ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత వైద్యురాలు
గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి చికిత్స చేస్తున్న మహిళా వైద్యురాలిపై దాడి జరిగింది. పేషెంట్ తో పాటు మరో ఐదారుగురు వ్యక్తులు దాడి చేసి డాక్టర్ ను గాయపరిచారు. ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పేషెంట్ తో సహా అందరూ మద్యం మత్తులో ఉన్నారని, డాక్టర్ ను తిడుతూ గొడవ చేశారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కోల్ కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన నేపథ్యంలో డాక్టర్లకు రక్షణ కరువైందని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..
ముంబైలోని సియోన్ ఆసుపత్రికి ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో రక్తమోడుతూ వచ్చాడు. ఆయనతో ఐదారుగురు వ్యక్తులు తోడుగా వచ్చారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న రెసిడెంట్ డాక్టర్ ఈ పేషెంట్ ను అటెండ్ అయ్యారు. గాయాలకు చికిత్స చేస్తుండగా పేషెంట్ తిట్లదండకం మొదలు పెట్టాడు. ఆపై మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. వైద్యురాలి కేకలతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా నిందితులు అందరూ పారిపోయారు. ఈ ఘటనపై బాధిత డాక్టర్ సియోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Woman Doctor
Attack On Doctor
Mumbai Hospital
Mumbai Police

More Telugu News