Allahabad High Court: భూ తగాదాలో ఓ కుటుంబం మొత్తాన్ని కోర్టుకు లాగిన దెయ్యం.. విస్తుపోయిన హైకోర్టు!

Land dispute case filed by ghost in Allahabad High Court
  • ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘటన
  • 2011లో చనిపోయిన వ్యక్తి 2014లో ఓ కుటుంబంపై ఫిర్యాదు
  • చనిపోయిన వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసిన పోలీసులు
  • గతేడాది హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పైనా సంతకం చేసిన దెయ్యం
  • అయోమయానికి గురైన న్యాయస్థానం
  • కేసును కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
  • చనిపోయిన వ్యక్తి ఎలా ఫిర్యాదు చేశాడో తెలుసుకోవాలని ఎస్పీకి ఆదేశం
మీరు నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం! ఓ భూ వివాదం కేసులో దెయ్యం చేసిన ఫిర్యాదు చివరికి హైకోర్టులో తేలింది. న్యాయ, పోలీసు వ్యవస్థను గందరగోళానికి గురిచేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో జరిగింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2011లో చనిపోయిన శబ్ద్‌ప్రకాశ్ అనే వ్యక్తి 2014లో భూ తగాదాకు సంబంధించి ఓ కుటుంబంలోని ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా ఫిర్యాదుదారుడైన చనిపోయిన వ్యక్తి (దెయ్యం) నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల చార్జ్‌షీట్‌ను నిందితులైన పురుషోత్తం సింగ్, ఆయన ఇద్దరు సోదరులు, ఇద్దరు కుమారులు అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. 

తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి 2011లోనే చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికెట్‌ను శబ్ద్ ప్రకాశ్ భార్యే ఇవ్వడం గమనార్హం. దీంతో విస్తుపోవడం కోర్టు వంతైంది. 2011లో చనిపోయిన వ్యక్తి 2014లో ఫిర్యాదు చేయడం ఏంటో? దానిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఏంటో? అర్థంకాక కోర్టు తలపట్టుకుంది. అంతేకాదు, చనిపోయిన వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా దర్యాప్తు అధికారి రికార్డు చేసినట్టు తెలిసి ఆశ్చర్యపోయింది. అక్కడితో అయిపోలేదు.. నిందితుల పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ గతేడాది కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పైనా చనిపోయిన వ్యక్తి సంతకం చేసిన విషయం తెలిసి న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యాం షంష్రే విస్తుపోయారు.

కేసును సమీక్షించిన కోర్టు నిందితులపై దాఖలైన చార్జ్‌షీట్‌ను కొట్టివేసింది. ఈ కేసుపై కుషీనగర్ ఎస్పీని ప్రశ్నించింది. చనిపోయిన వ్యక్తి పోలీసులకు ఎలా ఫిర్యాదు చేశాడో తేల్చాలని, ఫిర్యాదుదారు నుంచి దర్యాప్తు అధికారి వాంగ్మూలం ఎలా రికార్డు చేశాడో కూడా విచారణ చేయాలని ఆదేశించింది.
Allahabad High Court
Ghost
Land Dispute
Uttar Pradesh

More Telugu News