Sheikh Hasina: ఎన్నికలు ప్రకటించగానే బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా!.. ఆమె కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు

Sheikh Hasina said that his mother will return to their country when government announce Elections
  • మధ్యంతర ప్రభుత్వం ఎన్నికల నిర్ణయం తీసుకుంటే షేక్ హసీనా తిరిగి వెళ్తారన్న సాజీబ్ జాయ్
  • ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని వ్యాఖ్య
  • అవసరమైతే తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొత్తగా ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తారని అన్నారు. "ప్రస్తుతానికి ఆమె భారత్‌లో ఉన్నారు. ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ప్రభుత్వం నిర్ణయిస్తే తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తారు. ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది. మేము గెలవొచ్చు కూడా’’ అన్నారు. అమెరికాలో నివసించే సాజీబ్ వాజెద్ జాయ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని అన్నారు.

కాగా రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్ అట్టుడికిన విషయం తెలిసిందే. వారంరోజుల పాటు కొనసాగిన నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. దీంతో ప్రధానమంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు. సోమవారం భారత్‌కు వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. 

న్యూఢిల్లీలోని ఓ సురక్షిత నివాసంలో షేక్ హసీనా తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆమె యోచిస్తున్నట్లు భారతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే బ్రిటన్ హోంశాఖ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలావుంచితే బ్రిటన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం మాట్లాడారు. బంగ్లాదేశ్ పరిస్థితి గురించి వివరించారు. కానీ ఏయే అంశాలపై మాట్లాడారనే విషయాలను మాత్రం బహిర్గతం చేయలేదు.

ఇదిలావుంచితే.. నోబెల్ శాంతి అవార్డ్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో గురువారం మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ప్రమాణస్వీకారం చేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Sheikh Hasina
Bangladesh
Sajeeb Wazed Joy
India

More Telugu News