భారత్‌లో కూడా బంగ్లా తరహా హింసాత్మక నిరసనలు జరగొచ్చు: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
- నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
- ఈ నేపథ్యంలో సల్మాన్ ఖుర్షీద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు
- భారత్‌లో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా బంగ్లా మాదిరి హింసాత్మక ఆందోళనలు జరగొచ్చని హెచ్చరిక
- షాహిన్ బాగ్‌లో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని వ్యాఖ్య
మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా బంగ్లాదేశ్ మాదిరి హింసాత్మక, ప్రభుత్వ-వ్యతిరేక నిరసనలు జరిగే అస్కారం ఉందని హెచ్చరించారు. కశ్మీర్‌లోనూ, ఇక్కడా అంతా బాగానే ఉందనిపిస్తుందనీ, కానీ, క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితులు దాగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా ఆగ్నేయ ఢిల్లీలోని షాహిన్ బాగ్‌లో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశారు. మహిళలు నాయకత్వం వహించిన ఈ నిరసనలు దాదాపు 100 రోజుల పాటు కొనసాగాయన్నారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా ప్రేరణగా నిలిచాయని చెప్పారు. అయితే, ఈ నిరసనల్లో పాల్గొన్న చాలా మంది ఇప్పటికీ జైల్లో ఉన్నందున ఆయన దీనిని విఫలమైన ఆందోళనగా పేర్కొన్నారు.