Budda Venkanna: చేతిలో ఏమీ లేకపోవడంతో నా మాట చెల్లడం లేదు: బుద్ధా వెంకన్న

Budda Venkanna comments in Kesineni Chinni birthday celebrations
  • ఎంపీ కేశినేని చిన్ని బర్త్ డే వేడుకల్లో బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు
  • పదవి లేకపోవడంతో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన
  • ఎమ్మెల్యేలు ఎవరిని చెబితే వారిని సీఐలుగా నియమించారని వెల్లడి
  • తాను ఎలాంటి పోరాటాలు చేశానో అందరికీ తెలుసని స్పష్టీకరణ
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోరాటాలు చేసిన వారికి గౌరవం లేదని, పవర్ లో ఉన్నవారికే గౌరవం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటాలు చేసిన వారు వాస్తవానికి ఎమ్మెల్యే అవ్వాలని, ఇప్పుడీ విషయం తనకు అర్థమైందని అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేయాలన్నా తాను చేయలేని పరిస్థితిలో ఉన్నానని బుద్ధా వెంకన్న నిస్సహాయత వ్యక్తం చేశారు. 

సీఐల బదిలీల విషయంలో ఎమ్మెల్యేలు ఎవరిని చెబితే వారిని నియమించారని, పదవిలో లేను కాబట్టి తన మాట చెల్లడంలేదని అన్నారు. నాడు చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేశ్ దాడికి వెళితే తాను అడ్డుగా నిలబడ్డానని, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అప్పుడు ఎవరైనా వచ్చారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. 

"ఇప్పుడు ఓపెన్ గా చెప్పేస్తున్నా... నాకు మనసులో దాచుకోవడం నచ్చదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి పోరాటాలు చేశానో ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఇప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది కాబట్టి నేను పోరాటాలు చేయలేను... నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? విజయవాడ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెద్ద కాబట్టి ఎంపీ చిన్ని గారికి చెబుతున్నా. 

ఆవేదన వస్తే అది అగ్నిపర్వతమై పేలిపోతుంది. ప్రేమతో ఉంటాను తప్ప నేను ఎవరికీ భయపడను. మీరు మాకేమీ న్యాయం చేయలేకపోతున్నారని కార్యకర్తలు అంటున్నారు. ఏం చేస్తాం? చేతిలో ఏమైనా ఉంటేనే కదా చేయడానికి? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ అంశాన్ని నేను చంద్రబాబు, లోకేశ్ ల దృష్టికి తీసుకెళతా" అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
Budda Venkanna
Kesineni Chinni
Birthday
TDP
Vijayawada

More Telugu News