Theft: దొంగతనానికి వచ్చి.. రూపాయి కూడా దొరక్కపోవడంతో తానే అక్కడ రూ. 20 పెట్టి మరీ వెళ్లిన దొంగ.. వీడియో ఇదిగో!

Thief did not get even single rupee he put Rs 20 before leaving
  • రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘటన
  • ఇల్లంతా గాలించినా రూపాయి కూడా దొరకని వైనం
  • వెళ్తూవెళ్తూ ఫ్రిడ్జ్‌లో నీళ్లబాటిల్ తీసుకున్న చోరుడు
  • ఆపై ఆ బాటిల్ కాస్ట్ అంటూ రూ. 20 పెట్టిన వైనం
తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. ఇల్లంతా గాలించినా ఒక్క రూపాయి కూడా దొరక్కపోవడంతో అసహనం వ్యక్తం చేశాడు. వెళ్తూవెళ్తూ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుని దాని డబ్బులంటూ రూ. 20 టేబుల్‌పై పెట్టి మరీ వెళ్లిపోయాడు. 

ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు దొంగ ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించి సీసీటీవీని పరిశీలించారు. అందులో దొంగ పడిన పాట్లు కనిపించాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగిందీ ఘటన. ముఖం కొంచెం కూడా కనిపించకుండా పూర్తిగా కప్పేసుకున్న దొంగ.. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై ప్రతీ గది తిరుగుతూ గాలించాడు. ఎక్కడా అతడికి ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. 

దీంతో విసుగు చెందిన దొంగ ఇంట్లోని సీసీ టీవీ కెమెరా వద్దకు వచ్చి ఒక్క రూపాయి కూడా దొరకలేదంటూ వేలు చూపించాడు. ఆపై ఇదెక్కడి ఇల్లు రా బాబూ అంటూ దండం పెట్టాడు. ఆపై ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి ఓ నీళ్ల బాటిల్ తీసుకున్నాడు. వెళ్తవెళ్తూ మళ్లీ వెనక్కి వచ్చి జేబులోంచి పర్సు తీసి అందులోంచి రూ. 20 తీసి దానిని కెమెరా వైపు చూపిస్తూ.. బాటిల్ కాస్ట్ అని సైగచేసి ఆ నోటును టేబుల్‌పై ఉంచి వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.
Theft
Ranga Reddy District
Maheswaram
Crime News

More Telugu News